రామగుండంలో చెరువుల పునరుజ్జీవన పనులకు శ్రీకారం – వరద ముప్పు నివారణతో పాటు నగర సుందరీకరణపై దృష్టి…..
సాక్షిత పెద్దపల్లి// రామగుండం: నగర అభివృద్ధిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. అమృత్ 2.0 నిధుల ద్వారా రూ.2.53 కోట్లతో ప్రశాంత్ నగర్‌లోని మల్లపు రాణి కుంట, రూ.1.81 కోట్లతో మల్కాపూర్‌లోని బామండ్ల కుంట చెరువుల పునరుజ్జీవన పనులను నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల సుందరీకరణతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు గార్డెన్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో మల్కాపూర్, ప్రశాంత్ నగర్ లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వరద ముప్పు నివారణ కోసం కాలువల నిర్మాణం, పూడికతీత పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు పేదలు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, సోలార్ ప్లాంట్ల ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన వైపు దారి తీస్తోందని అన్నారు. రామగుండాన్ని వ్యాపార, విద్య, వైద్య కేంద్రంగా మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ చెరువుల అభివృద్ధితో పాటు మూడవ డివిజన్‌లో మరో రూ.1 కోట్ల పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారని తెలిపారు. మే నెల రెండవ వారంలో రోడ్లు, కాలువల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజలు సహకరించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు వడ్లూరి రవి, వెంగళ బాపు, చిదురాల నాగరాజు, కొలని కవిత, ధూళికట్ట సతీష్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం డి.ఇ. నర్సింహ స్వామి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY