జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ తెలంగాణలో రియల్-సైజ్ ఎల్టీ స్విచ్‌గియర్ శిక్షణ మాడ్యూల్ ప్రారంభం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ తెలంగాణ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ (ఈ ఎం డి ) ఆధ్వర్యంలో ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యుత్ భద్రతపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో రియల్-సైజ్ లో టెన్షన్ (ఎల్ టి) స్విచ్‌గియర్ శిక్షణ మాడ్యూల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ శిక్షణా కేంద్రాన్ని ఎన్టీపీసీ తెలంగాణ సీఎజీఎం (ఓ అండ్ ఎం) ముకుల్ రాయ్ ప్రారంభించగా, జీఎం (మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్) అవిజిత్ దత్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ శిక్షణ మాడ్యూల్లో పూర్తిస్థాయి పనితీరు కలిగిన ఎల్టీ స్విచ్‌గియర్ ప్యానెల్, ఎల్టీ సర్క్యూట్ బ్రేకర్, స్విచ్ ఫ్యూజ్ యూనిట్ (ఎస్ ఎఫ్ యు ), మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ (ఎం సి సి బి ) వంటి కీలక విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేకంగా ఆపరేషన్ ఇంజినీర్లు, ఆపరేటర్లు, ఈఎండీ సిబ్బంది కోసం రూపొందించిన ఈ శిక్షణ మాడ్యూల్ ద్వారా ఎల్టీ స్విచ్‌గియర్ పరికరాలపై ప్రత్యక్ష అనుభవంతో కూడిన శిక్షణ అందించనున్నారు. పరికరాల అంతర్గత నిర్మాణం, పనితీరు విధానం, భద్రతా వ్యవస్థలు, లోపాల గుర్తింపు, ట్రబుల్షూటింగ్, నిర్వహణ పద్ధతులపై ఉద్యోగులకు ప్రత్యక్ష అవగాహన కల్పించబడుతుంది.
ఈ శిక్షణా కేంద్రం ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు రోజువారీ విధుల్లో సురక్షితమైన పని విధానాలను అలవర్చుకునేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సిద్ధాంత పరిజ్ఞానానికి ఆచరణాత్మక శిక్షణను జోడించడం ద్వారా పనితీరు సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, భద్రత, సాంకేతిక ఆవిష్కరణలు, నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను ఎన్టీపీసీ తెలంగాణ నిరంతరం చేపడుతోందని, అత్యున్నత స్థాయి కార్యాచరణ భద్రత, విశ్వసనీయత సాధనకు సంస్థ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

