“సంక్షేమ సంస్థల్లో నాణ్యమైన సేవలే లక్ష్యం.. చిన్నారులు, వృద్ధుల సంరక్షణలో రాజీ లేదు….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, సుల్తానాబాద్/ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఉంటున్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
సుల్తానాబాద్ మండలంలోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాల సదనం పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రంతో పాటు పెద్దపల్లిలోని రంగంపల్లి బాల రక్షక భవన్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా సంస్థల్లో వసతి సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, చిన్నారులు, వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వంటశాలలు, డార్మిటరీలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్.. వంటశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, పరిసరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గదుల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, అవసరమైన చోట తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
సిబ్బంది సమయపాలన తప్పనిసరి
సిబ్బంది విధుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆరా తీసిన కలెక్టర్.. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకు హాజరై, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయి బాధ్యతతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సంస్థల పనితీరుపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యం, భద్రత, ఆహారం, వసతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారి అవసరాలను గుర్తించి తక్షణమే పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని స్పష్టం చేశారు.
బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి
బాల రక్షక భవన్లో చిన్నారుల సంరక్షణ, రక్షణకు సంబంధించిన అంశాలను కలెక్టర్ సమీక్షించారు. అక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన జాబ్ చార్ట్ ప్రకారం విధులను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సిబ్బంది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అనంతరం పోక్సో కేసులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలలపై లైంగిక వేధింపులు, హింస వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధిత చిన్నారులకు సకాలంలో రక్షణ, అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ తదితర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల రక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
భరోసా కేంద్రాలను కూడా పరిశీలించిన కలెక్టర్.. బాలల రక్షణ, సంరక్షణకు సంబంధించిన కేసులను సున్నితంగా పరిగణించి, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ సేవలు, రక్షణ వ్యవస్థలపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
బాలలపై జరిగే హింస, వేధింపులు, నిర్లక్ష్యం వంటి ఘటనలను గుర్తించి సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా ప్రతి కేసు అధికారుల దృష్టికి చేరి బాధిత చిన్నారులకు సకాలంలో రక్షణ, సహాయం అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, సంస్థల నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


