ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

Sakshitha news

“ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు….”

–కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరిక…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : మంథని మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.ఎన్. జయ ప్రకాశ్పై వచ్చిన ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

ఆగస్టు 7న. మంథని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు జయ ప్రకాశ్‌పై పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి ప్రాథమిక విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, విధుల పట్ల అంకితభావం లోపించడం, ప్రభుత్వ ఉద్యోగికి తగని ప్రవర్తన వంటి అంశాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా) నిబంధనలు, 1964లోని రూల్ 3(1), 3(2) నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో శాఖాపరమైన విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 20 ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు CCA రూల్స్, 1991లోని రూల్ 8(1) ప్రకారం జయ ప్రకాశ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కాలంలో జీవనాధార భత్యంతో పాటు డి.ఏ., ఇతర పరిహార భత్యాలు చెల్లించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Scroll to Top