సచివాలయ ఉద్యోగిపై దాడికి నిరసన

Sakshitha news

సచివాలయ ఉద్యోగిపై దాడికి నిరసన

** సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలో ప్రభుత్వ విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి నాగార్జున యాదవ్‌పై జరిగిన దాడిని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం అత్యంత అనాగరిక చర్య అని పేర్కొన్నారు. సిఎన్ఆర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానిని పన్ను బకాయిలు అడిగినందుకు నాగార్జున యాదవ్ పై దాడి చేసి, రక్తగాయాలు చేయడం బాధాకరమని అని పేర్కొన్నారు.

ఈ ఘటనపై నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని కోరారు. నిన్నటి రోజు దాడి జరిగిన వెంటనే సిఐటియు నేతలు ఆసుపత్రికి వెళ్లి నాగార్జున యాదవ్ ను పరామర్శించారని, అనంతరం వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించారని తెలిపారు.

నిరసన కార్యక్రమం తర్వాత అనంతరం మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి, వెంటనే పోలీసులతో మాట్లాడి ఘటనపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని, విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

బాధితుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న విపరీతమైన పని ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేశారు.

వాలంటీర్ వ్యవస్థ రద్దయిన తర్వాత అన్ని రకాల సర్వేలు, పన్నుల వసూలు వంటి బాధ్యతలు ఉద్యోగులపైనే మోపడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. పని భారం తగ్గించకపోవడం వల్లే అనేకమంది ఉద్యోగులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, తక్షణమే పని భారాన్ని తగ్గించాలని అన్నారు.

విధుల్లో ఉన్న ఉద్యోగులకు భద్రత కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన సచివాలయ సిబ్బందికి సరైన రక్షణ లేకపోతే వారు నిర్భయంగా విధులు నిర్వహించలేరని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు ఎస్. జయచంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిఐటియు నాయకులు కె. వేణుగోపాల్, నగర అధ్యక్షురాలు పి. బుజ్జి, సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు టి. రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కారానికి . ముందు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్స్ యూనియన్ కార్యదర్శి ఆనంద్, మహిళా సంఘం నాయకులు జయంతి, సిఐటియు నాయకులు మురళి, మల్లికార్జున రావు,ఏఐటియుసి నాయకులు పి మురళి,నగర కార్యదర్శి ఎండి రవి, విశ్వనాధ్, చలపతి,వెంకటేష్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య, సచివాలయ ఉద్యోగులు కోటేశ్వరరావు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top