ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత….
–మనాలి ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:అంతర్గం, రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ మంగళవారం అంతర్గం మండలం పొట్యాల గ్రామంలో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను కలిసి ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన అర్హులైన యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివరాల్లో మార్పులు ఉన్నవారు లేదా పేర్లు తొలగిపోయిన వారు సంబంధిత దరఖాస్తులు సమర్పించి సవరణలు చేయించుకోవాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని, ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మనాలి ఠాకూర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
