గోదావరి మహా పుష్కరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి– ఆర్డీవో రాణి సుస్మిత

Sakshitha news

గోదావరి మహా పుష్కరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి– ఆర్డీవో రాణి సుస్మిత

భక్తుల సౌకర్యాల కోసం సమగ్ర చర్యలు చేపడదాం
– ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

గోదావరి మహా పుష్కరాలు – 2027 నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరు పట్టణం పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు.

గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో 2027 గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ 2027 గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్న తరుణంలో ఏర్పాట్లను ముందస్తుగా పక్కా ప్రణాళికలతో సిద్ధం చేయాలని సూచించారు. కొవ్వూరు డివిజన్‌లో ప్రధానంగా 48 పుష్కర ఘాట్లు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కొవ్వూరు డివిజన్‌లో 67 దేవాలయాల అభివృద్ధికి మొదటి విడతగా ₹9.87 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆమె వెల్లడించారు. ఇకపై వారానికి ఒక్కసారి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొవ్వూరు నియోజకవర్గం వైపు కూడా భక్తులను పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ , తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలకి చెందిన వారు కూడా కొవ్వూరు లో పుణ్య స్నానాలు ఆచరించడానికి రావడం జరుగుతుందని తెలియ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మంత్రుల కమిటీ ఏర్పాటైనట్లు తెలిపారు. ఆ కమిటీ ముందు కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రతిపాదిత పనుల సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. ఘాట్ల అభివృద్ధి, దేవాలయాల మరమ్మతులు, భక్తుల సౌకర్యాల కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కొవ్వూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద అభివృద్ధి పనులకు టూరిజం శాఖతో ప్రణాళికలు సిద్ధం చేయమని తెలిపారు. కొవ్వూరు పట్టణ అభివృద్ధికి ఇది మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, సూరపనేని చిన్ని, డీఎస్పీ దేవ కుమార్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి పీవీ సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈఈ కే. ఆనందబాబు, తహసీల్దార్ ఎం. దుర్గాప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.