జగన్ ది దగా డీఎస్సీ.. చంద్రబాబుది మెగా డీఎస్సీ: ప్రత్తిపాటి
సాక్షిత : * హామీల అమల్లో కూటమిప్రభుత్వ మరో ఘనత : ప్రత్తిపాటి.
- జగన్ దగా డీఎస్సీతో నిరుద్యోగుల్ని వంచిస్తే.. లోకేశ్ మెగా డీఎస్సీతో వారి కలలు నిజం చేశాడు : ప్రత్తిపాటి.
- డ్రాఫ్ట్ కీ అభ్యంతరాలు, 100న్యాయవివాదాలు అధిగమించి లోకేశ్ యువత కలలు నిజం చేశాడు : ప్రత్తిపాటి.
- 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలభర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ రాష్ట్రయువతకు పంగనామాలు పెట్టాడు : ప్రత్తిపాటి.
“ ఏటా మెగాడీఎస్సీ అమలు చేస్తానని చెప్పిన జగన్.. ఐదేళ్లు అధికారంలో ఉండి దగా డీఎస్సీ అమలుచేశాడు. రాష్ట్ర యువతను వంచించి, వారి కలలను భగ్నం చేశాడు. వారి జీవితాలను గంజాయి.. డ్రగ్స్.. కల్తీ మద్యానికి బానిసల్ని చేసి రాష్ట్రప్రగతికే ప్రతిబంధకుడిగా మారాడు. యువత శక్తియుక్తుల్ని నిర్వీర్యం చేసి, దేశ ఆర్థికాభివృద్ధికే అడ్డుపడ్డాడు. సీపీఎస్.. పీఆర్సీ అమలుపై తనను ప్రశ్నించారన్న అక్కసుతో జగన్ ఉపాధ్యాయులపై కక్షకట్టి, వారితో చేయకూడని పనులు చేయించాడు. వారు తనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న దురుద్దేశంతో చివరకు ఎన్నికల విధుల నుంచి తప్పించడానికి కుట్రలు పన్నాడు.
టీడీపీ హాయాంలోనే 2లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మరో ఘనత సాధించింది. టీడీపీ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే టీడీపీ అని మరోసారి నిరూపితమైంది. 2014-19లో 18వేల పోస్టులతో డీఎస్సీ అమలుచేసిన చంద్రబాబు ప్రభుత్వం, నేడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కార్యరూపమిచ్చింది. 1994 నుంచి నేటివరకు టీడీపీ హాయాంలోనే రాష్ట్రంలో 2లక్షల (1,96,219) టీచర్ పోస్టులు భర్తీకావడం చారిత్రాత్మక మైలురాయి అనే చెప్పాలి.
అభ్యంతరాలు.. న్యాయ వివాదాలు అధగమించి మెగాడీఎస్సీ ప్రక్రియ పూర్తిచేయడం లోకేశ్ కే సాధ్యమైంది.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ పట్టుదల, పక్కా ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వానికి సాధ్యం కాని మెగా డీఎస్సీ అమలు ఆచరణసాధ్యమైంది. డ్రాఫ్ట్ కీ అభ్యంతరాలు, 100కు పైగాన్యాయ వివాదాలను అధిగమించి లోకేశ్ కేవలం 150 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేయడం అసామాన్యం.. అనితరసాధ్యం. నాడు-నేడు పేరుతో రాష్ట్ర విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాల స్థానంలో లోకేశ్ ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలు రాష్ట్ర విద్యారంగాన్ని జాతీయస్థాయిలో పురోగమింపచేస్తున్నాయి. విద్యారంగాన్ని వృద్ధిచేయడమంటే పాఠశాలలకు రంగులు వేయడం కాదని, భావిభారత పౌరులైన చిన్నారుల ప్రతిభాపాటవాలను పెంపొందించడమనే సత్యాన్ని లోకేశ్ అక్షరాలా నిజం చేశారు.. ప్రాథమిక స్థాయి నుంచే విద్యాబోధనలో నూతన పాఠ్యాంశాలు, సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ చిన్నారుల జీవితాలను సన్మార్గంలో నడిపిస్తున్నారు. ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించే క్రమంలో గతప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరుబడుల విద్యావిధానం స్థానంలో లోకేశ్ 9 బడుల విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యవిలువ తెలిసిన వ్యక్తి కనుకే, రాష్ట్ర విద్యారంగం లోకేశ్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. డీఎస్సీ తుది జాబితాలో చోటు దక్కని వారు నిరుత్సాహ పడవద్దని, ఏటా డిఎస్సీ నిర్వహణతో అర్హులైన వారికి తప్పక న్యాయం చేస్తామన్న మంత్రి లోకేష్ ప్రకటన స్వాగతించవలసిన అంశం.
” అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు.
