స్వచ్ఛ రామగుండం సాధనలో ప్రజల భాగస్వామ్యం అవసరం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్….
మాతంగి కాలనీ, ప్రగతి నగర్‌లలో ఎమ్మెల్యే, మేయర్ విస్తృత పర్యటన…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా 23వ. డివిజన్ మాతంగి కాలనీ, ప్రగతి నగర్ ప్రాంతాల్లో నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకవైపు గత మూడు నెలలుగా కాలువల్లో పూడికతీత పనులు కొనసాగుతుండగా, మరోవైపు ప్రజలు అదే కాలువల్లో చెత్త వేయడం సరైనది కాదన్నారు. స్వచ్ఛ రామగుండం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలనీ పెద్దలు, మహిళలు బాధ్యత తీసుకుని తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైతే మున్సిపాలిటీని సంప్రదించాలని సూచించారు.
మాతంగి కాలనీలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన నేపథ్యంలో తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు అప్పగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. ఎఫ్‌సీఐ నుంచి ఎన్‌టీపీసీ వరకు ఉన్న రహదారిపై గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు.
ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతమైన మాతంగి కాలనీ అభివృద్ధి బాధ్యతను కూడా సంబంధిత సంస్థ తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనే సమీప ప్రాంతాల అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
సింగరేణి డీఎంఎఫ్‌టీ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, జెన్‌కో సంస్థల సిఎస్‌ఆర్ నిధులను సద్వినియోగం చేసి ఉంటే రామగుండం నగరం వరంగల్, కరీంనగర్ తరహాలో ఎప్పుడో అభివృద్ధి చెందేదని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన రామగుండం నగరాన్ని పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బృందంగా పనిచేస్తున్నామని తెలిపారు.
నగరంలోని ప్రతి చివరి ఇంటి వరకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కాలువల్లో పూడికతీత పనులు జరగలేదని, ఫలితంగా మురుగు నీరు నిలిచి అనారోగ్యకర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధికి కావాల్సిన నిధులు సమకూరుస్తున్నారని తెలిపారు.
స్థానిక కార్పొరేటర్ సునీత బెంద్రం రాజిరెడ్డి మాతంగి కాలనీ, ప్రగతి నగర్ ప్రాంతాల సమస్యలను వివరించి యూజీడీ, రహదారులు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, బస్తీ దవాఖానకు అదనపు గదులు నిర్మించాలని కోరారు.
ఈ సందర్భంగా రహదారులపైకి వచ్చిన గద్దెలు, ఆక్రమణలు, చెట్ల కొమ్మలను తొలగించారు. ముళ్ల పొదలను తొలగించి ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మార్గాన్ని సుగమం చేశారు. అలాగే మురుగు నీటితో నిండిపోయిన కాలువలను యంత్రాలతో శుభ్రం చేయించారు. నీటి ప్రవాహం సరిగా లేని చోట కొత్త కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టీపీఎస్ నవీన్, ఏఈ మనోజ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ సంపత్, పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
