ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట – ఎల్-1 అర్హులకే మంజూరు, 45 రోజుల్లో నిర్మాణం తప్పనిసరి…
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఎల్-1 కేటగిరీలో అర్హులైన వారికే గృహాలు మంజూరు అవుతాయని, మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా 45 రోజుల్లోపు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు.
ఎన్‌టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిన దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించిందన్నారు. ఇంటి స్థలం ఉండి అన్ని అర్హతలు ఉన్నవారు ఎల్-1 జాబితాలో ఉంటారని, గెజిటెడ్ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించిన తర్వాత జిల్లా స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తై, ఇన్‌చార్జి మంత్రి అనుమతితోనే గృహాలు మంజూరు అవుతాయని తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు 449 మంది ఎల్-1 లబ్ధిదారులకు ఇళ్లు మంజూరవగా, వారిలో 184 మంది మాత్రమే నిర్మాణం ప్రారంభించారని చెప్పారు. ధర్మారం ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నప్పటికీ, రామగుండంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం గృహం మంజూరైన 45 రోజుల్లోపు నిర్మాణం ప్రారంభించకపోతే మంజూరును రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే రద్దుకు ముందు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, అనంతరం కూడా నిర్మాణం ప్రారంభించకపోతే ఇతర అర్హులకు గృహాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా విడుదల అవుతున్నాయని, నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మేరకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.
ప్రజాప్రతినిధుల ద్వారా అందిన 1,312 దరఖాస్తుల్లో 607 మంది ఎల్-1 కేటగిరీలో ఉన్నట్లు విచారణలో గుర్తించామని, ప్రస్తుతం వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.
ఎల్-2 కేటగిరీలో ఉన్న 700 మంది ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పిస్తే అర్హత నిర్ధారించి ఎల్-1 కేటగిరీకి మార్చే అవకాశం ఉందని వివరించారు.
2014కు ముందు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నిర్మాణం పూర్తికాని కుటుంబాలకు ప్రభుత్వం మరోసారి సహాయం అందిస్తోందని, బేస్‌మెంట్ వరకు మాత్రమే నిర్మించిన వారు అక్కడి నుంచి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ విస్తీర్ణం 600 చదరపు అడుగులు, స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులకు మించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కంప్యూటర్ ద్వారా బిల్లులు ఆమోదం పొందవని హెచ్చరించారు.
ప్రజాపాలనలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, గుడిసెలు లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ట్రాన్స్‌జెండర్లు సహా అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసిల్దార్ రవీందర్ రావు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

