రైల్వే అభివృద్ధిలో అభిప్రాయ సేకరణ కీలకం

Sakshitha news

రైల్వే అభివృద్ధిలో అభిప్రాయ సేకరణ కీలకం

** “అమృత సంవాద్” లో డైరెక్టర్ సత్యనారాయణ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అమృత భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద ఇప్పటికే తిరుపతిలో చేపట్టిన అభివృద్ధులపై సమీక్ష, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అభిప్రాయ సేకరణ ఎంతో కీలక పాత్ర వహిస్తుందని తిరుపతి రైల్వే డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. “అమృత సంవాద్” కార్యక్రమంలో భాగంగా గురువారం రైల్వే వీఐపీ హాల్ లో వివిధ వర్గాల నుంచి ప్రత్యక్ష అభిప్రాయం తెలుసుకునే సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన పంచ ప్రాణాల సూత్రాన్ని మార్గదర్శకంగా తీసుకొని, రైల్వే మంత్రిత్వ శాఖ స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కింద ఒక కొత్త పౌర కేంద్రిత కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని చెప్పారు.
మరిన్ని అభివృద్ధి అవసరాల గుర్తింపు కోసమే ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ జరపడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రజల స్వరమే అభివృద్ధికి శక్తి అన్నారు. ప్రస్తుత కార్యక్రమాలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకోవడం, తద్వారా భారతీయ రైల్వే అభివృద్ధి యాత్రలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
క్యూఆర్ ద్వారా ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్ సేకరణ,
శుభ్రత… బాధ్యత పట్ల ప్రజా ప్రతిజ్ఞ చేయడం ద్వారా
ప్రయాణికులు/వినియోగదారులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైల్వే నిర్వహణలో భాగస్వాములయ్యేలా చూడడం ప్రధానం అన్నారు.
మీ స్వరం మన తిరుపతి స్టేషన్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రజలకు తెలిపారు. మనందరం కలిసి సుందరమైన, సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ నిర్మిద్దాం అని కుప్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. అందుకోసం మన అమూల్యమైన సూచనలు ఇచ్చి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని స్టేషన్ డైరెక్టర్, రైల్వే అధికారులు, అమృత్ భారత్ స్టేషన్ పథకం బృందం కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ రెడ్డెప్ప, సీసీఎం సత్యనారాయణ, సీసీఐ శ్రీకాంత్, ఇంజినీర్ దరూరు ప్రభాకర్, అధికారులు, తిరుపతి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.