కొనసాగుతున్న “స్విమ్స్” పింక్ బస్ సేవలు

Sakshitha news

కొనసాగుతున్న “స్విమ్స్” పింక్ బస్ సేవలు

** గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో సోమవారం పాకాల మండల కేంద్రంలోని పిహెచ్సీతోపాటు దామలచెరువులోని గ్రామ సచివాలయం-1లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు డాక్టర్ బాబు అలెగ్జాండర్, డాక్టర్ రవిరామ్ తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

పింక్ బస్ క్యాంపుల వివ‌రాలు

  • 18న దామినేడు, రేణిగుంట.
  • 22న మంగళం, తారకరామానగర్.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి.ప్రత్యూష, డాక్టర్ ఎం.లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో డాక్టర్ అరవింద్ కుమార్, డాక్టర్ లక్ష్మీ పూజిత, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, ఎంపిహెచ్ఈఓ వాట్కిన్స్, ఎంపిహెచ్ఎస్ లు వెంకట్రమణ, చిట్టెమ్మ, అంజలీ దేవి, టీటీడీ పీఆర్వో సిబ్బంది చంద్రమోహన్, స్విమ్స్ పీఆర్వో రాజశేఖర్, పిహెచ్సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.