దసరా కల్లా పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభం….

Sakshitha news

దసరా కల్లా పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభం….

గ్రామ గ్రామాలకు ఆర్టీసీ సేవలు విస్తరణ….

— ఎమ్మెల్యే విజయరమణ రావు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, : దసరా పండుగ నాటికి పెద్దపల్లి ఆర్టీసీ డిపోను ప్రారంభించి, గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి–చొప్పదండి మధ్య కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సును స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తుర్కలమద్దికుంట నుంచి జూలపల్లి వరకు మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, పెద్దపల్లి ఆర్టీసీ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే దసరా నాటికి డిపోను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన పెద్దపల్లి–చొప్పదండి బస్సు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

పెద్దపల్లి బస్ డిపో పేరును ఆర్టీసీ చరిత్రలో నమోదు చేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ప్రజా రవాణాకు కొత్త ఊపునిచ్చిందన్నారు.

కొత్త బస్ డిపో ఏర్పాటుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాజధాని హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, పలు గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.