
వడ్లను గోటి తో ఒలిచిన పవిత్ర తలంబ్రాల సమర్పణ
భక్తి, నిష్ఠకు ప్రతీకగా దంపతుల సేవ
…..
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తి, ఆచారానికి ప్రతీకగా నిలిచే విశిష్ట సంఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట మండలం బాలేంల గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు–యాదమ్మ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని దేవాలయ కమిటీకి సమర్పించారు.
గత మూడు నెలలుగా నిరంతర నిష్ఠతో వడ్లను గోటితో ఒలిచి, సంప్రదాయ పద్ధతిలో సిద్ధం చేసిన ఒక కేజీ 250 గ్రాముల బియ్యాన్ని శుక్రవారం భక్తిపూర్వకంగా అందజేశారు. వారి సేవలో ప్రతిబింబించిన శ్రద్ధ, భక్తి చూసి ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక మాధుర్యంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ, ఇదే విధంగా సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కల్యాణానికి మరియు బొడ్రాయి బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి కూడా కేజీ చొప్పున సమర్పించినట్లు తెలిపారు. దంపతుల ఈ విశిష్ట సేవను ప్రశంసిస్తూ దేవాలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్, కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, సభ్యులు దేవరశెట్టి సోమయ్య, అర్చకులు బట్టారం వంశీకృష్ణ, మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి, నియమ నిష్ఠలతో చేసిన ఈ తలంబ్రాల సమర్పణ, ఆధ్యాత్మిక విలువలను మరింతగా చాటుతూ భక్తులకు ప్రేరణగా నిలిచింది.
