జిల్లా కలెక్టర్ ఆనంద్ ను కలిసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
సాక్షిత : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్నానది కరకట్టలు బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ని కోరారు. ఇప్పటికే సోమశిల జలాశయంలో 65 టిఎంసిల నీళ్లు చేరిన నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నెల్లూరు పరిధిలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి ఆమె పలు విషయాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కనిగిరి రిజర్వాయర్ మట్టికట్టను బలోపేతం చేయడంతో పాటు.. షట్టర్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే రానున్న రబీ సీజన్ నేపథ్యంలో సాగునీటి కాలువలకు మరమ్మతులు చేస్తే నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయని ఆమె కలెక్టర్‌కు వివరించారు.షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతుల సమస్యలను కూడా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు సంబంధించి కేసుల విషయాలను కలెక్టర్‌తో చర్చించారు. దాంతో పాటు పి4 కార్యక్రమం కింద మైపాడు వద్ద చేపట్టిన బకింగ్ హమ్ కెనాల్ సుందరీకరణ పనులను ఉద్యాన శాఖ అధికారులు పర్యవేక్షించి కావాల్సిన మొక్కలు, పచ్చదనం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అంశాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రబీ ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేసేలా సహకరించాలని కోరారు. వారితో రైతు నాయకులు విజయకృష్ణా రెడ్డి, లక్ష్మయ్య, సింగరి వీరరాఘవలు, పాకం వెంకయ్య, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడు, కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
