చాకలి ఐలమ్మ వర్ధంతికి నివాళి అర్పించిన : ఎమ్మెల్యే జారే
భూస్వాముల అన్యాయానికి ఎదురు నిలబడిన వీర వనిత చాకలి ఐలమ్మ
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన గొప్ప ఉద్యమకారిణి అని అన్నారు. పేద కుటుంబానికి చెందిన ఆమె న్యాయం కోసం భూస్వాముల అన్యాయానికి ఎదురు నిలబడి రైతాంగానికి ధైర్యం నూరిపోసిన మహిళగా చరిత్రలో నిలిచారన్నారు.
తనంతట తాను కూలి పని చేస్తూనే పేద కుటుంబాల బాధలు తనవిగా భావించి అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన త్యాగం ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. భూస్వాముల అణచివేతకు లోనుకాకుండా సాధారణ మహిళ కూడా సమాజంలో మార్పు తీసుకురాగలదని తన జీవితంతో నిరూపించారు. చాకలి ఐలమ్మ పోరాటం వలనే గ్రామీణ ప్రజలకు వారి భూమిపై హక్కులు దక్కాయని అణగారిన వర్గాలకు గౌరవం లభించిందని మహిళల శక్తి ఏ స్థాయిలో మార్పు తీసుకురాగలదో ఆమె చూపిన మార్గమే నేటికీ మనందరికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేటి యువత మహిళలు ఐలమ్మ జీవితం వారి సేవలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
