పుట్నూరు రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఓ. సంపత్ అధిక సాంద్రత పద్ధతి (హెచ్‌డీపీఎస్)లో పత్తి సాగుకు సంబంధించిన భూమి తయారీ, విత్తే విధానం, యాంత్రీకరణకు అనుకూలత, తక్కువ కాలంలో అధిక దిగుబడి సాధించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పలువురు అభ్యుదయ రైతులకు ఉచిత పత్తి విత్తన ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఓ. సంపత్ మాట్లాడుతూ హెచ్‌డీపీఎస్ అంటే సాధారణ పద్ధతితో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ మొక్కలను నాటి, తక్కువ ఎత్తు, తక్కువ కాలంలో అధిక దిగుబడి పొందే ఆధునిక సాగు విధానమని వివరించారు. పత్తిలో ఈ పద్ధతిని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా రైతులకు చూపించి అవగాహన కల్పించారు. ప్రతి విత్తన రకం యొక్క దిగుబడి సామర్థ్యం, తెగుళ్లు, పురుగుల నిరోధకత, నీటి అవసరం, కోతకు వచ్చే రోజులు, అనువైన భూమి రకం వంటి ముఖ్య లక్షణాలను బ్యానర్లు, పాంప్లెట్ల ద్వారా స్పష్టంగా వివరించారు.
ఎల్నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, ఆముదం, కంది వైపు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు, సన్న వడ్లు అన్ని డీలర్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఓ. సంపత్, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్, ఏఈఓలు కే. శ్రీకాంత్, జే. సుష్మ, ఎం. సువర్ణరేఖ పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
