రక్తదానం రిజిస్టర్ ప్రత్యేకంగా నిర్వహించండి
** అశ్విని ఆసుపత్రి తనిఖీలో జేఈఓ శరత్
సాక్షిత ప్రతినిధి – తిరుమల: తిరుమలలో ఉన్న టీటీడీ అశ్విని ఆసుపత్రి, డిస్పెన్సరీలను టీటీడీ జేఈవో (విద్య, వైద్య) డా.ఎ.శరత్ ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవల నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అశ్విని ఆసుపత్రి, డిస్పెన్సరీలలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను భక్తులకు స్పష్టంగా తెలియజేసేలా తగిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రక్తదానానికి సంబంధించిన వివరాలను ఓపీ నమోదు రిజిస్టర్‌లో కాకుండా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.
అశ్విని ఆసుపత్రిలో ఈసీజీ పరీక్షలు చేయించుకునే రోగుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు పీఏసీ–5 ఉచిత డిస్పెన్సరీలో వెంటనే ఒక వైద్యుడిని నియమించాలని ఆదేశించారు. అశ్విని ఆసుపత్రి వద్ద ప్రవేశ ద్వారం లేదా వెనుక భాగంలో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జీఎన్‌సీ వద్ద భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే రోగుల నమోదు వివరాలను కేస్ షీట్‌లో వ్యాధి నిర్ధారణను స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో టీటీడీ సిఎంవో
డా.కుసుమ కుమారి, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
