మ్యాజిక్ వీవ్స్.. మహిళా సాధికారతకు వేవ్స్!
- జిల్లాలోనూ మ్యాజిక్ వీవ్స్‌కు శ్రీకారంచుడదాం
- స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిద్దాం
- ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో ముందడుగు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మ్యాజిక్ వీవ్స్ కార్యక్రమం ఔత్సాహిక స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాల సాధనలో మరో అడుగు ముందుకేస్తూ ఆశల తరంగాల్లా ఈ వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఆప్కో ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఎర్రబాలెంలో అమలవుతున్న మ్యాజిక్ వీవ్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం పరిశీలించారు. హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ జి.రేఖారాణితో మాట్లాడి కార్యక్రమ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ హితంగా సంప్రదాయ చేనేత కళకు ఆధునిక డిజైన్లను జోడించి.. విలువైన ఉత్పత్తులను రూపొందించడం, తద్వారా అనాథలు, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రస్తుతం 30 మంది అనాథ పిల్లలకు వస్త్రాన్ని గ్రేడింగ్ చేసి బ్యాగులు, పౌచ్‌లు, దుస్తులు, ఫైల్ కవర్లు, ఔషధ కిట్లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ చిన్న వయసు నుంచే సృజనాత్మకత, పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని రేఖారాణి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విలువ జోడింపుతో ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని.. ఆప్కో ద్వారా వస్త్రాలు, యంత్రాలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ, మార్కెట్ లింకేజీ సౌకర్యాల సహకారంతో కార్యక్రమాన్ని జిల్లాలోనూ అమలుచేస్తామని తెలిపారు. ఈ మ్యాజిక్ వీవ్స్ కార్యక్రమం చేనేత వారసత్వ సంపద పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, ఉపాధి సృష్టి, సామాజిక భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుందని.. స్వర్ణాంధ్ర సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
