అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు రుణాలు

Sakshitha news

అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలి

వనపర్తి జిల్లాలో రూ. 5,990 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

రుణాల మంజూరులో లక్ష్యాలను అధిగమించిన మూడు బ్యాంకులకు ప్రత్యేకంగా అభినందనందించిన కలెక్టర్

సాక్షిత వనపర్తి :
            రైతులు, విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

             జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) మరియు డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (DLRC) సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా చేపట్టిన రుణాల పురోగతిపై కలెక్టర్ ఈ సమావేశంలో సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, ఎం ఎస్ ఎం ఈ, విద్య, స్వయం సహాయక సంఘాల, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు పై కేటగిరి వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 5,990 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం బ్యాంకులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని సూచించారు.

         కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని ఆదేశించారు. రుణాల మంజూరులో సిబిల్ స్కోర్‌ను ఒక ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులు రుణాల కోసం తిరస్కరణకు గురికాకుండా బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, అటువంటి బ్యాంకులు వెంటనే తమ పనితీరును మెరుగుపరుచుకుని లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
            
బ్యాంకులు అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించి వ్యవసాయం, స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME) తదితర రంగాలకు విస్తృతంగా రుణాలు అందించాలని కోరారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కోరారు.ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ పథకాలను సమీక్షించిన కలెక్టర్ లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఆలస్యం అవకుండా కారణాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పథకాల విషయంలో బ్యాంకులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అయిన సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన కు సంబంధించి ప్రతి బ్యాంకు లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఖాతాదారులందరికీ ఈ బీమా పథకాలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకునే ప్రతి ఒక్క లబ్ధిదారుకు బీమా పథకాలను వర్తింపజేయాలని తెలియజేశారు.

విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఆలస్యం చేయకుండా, నిబంధనల మేరకు  రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. అలాగే విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం అధిక మొత్తంలో రుణాలు అవసరమైన విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు.

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో లక్ష్యాలను సాధించడమే కాకుండా అంతకుమించి రుణాలను మంజూరు చేసిన మూడు బ్యాంకులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, మెమెంటోను అందజేశారు.

ఇక జిల్లా కేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతినిధులకు ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ప్లంబింగ్, కుకింగ్, ఏసీ రిపేరు వంటి వాటికి బాగా డిమాండ్ ఉందని, అటువంటి కోర్సులను అందుబాటులో ఉంచి ఆసక్తి కలిగిన వారికి శిక్షణ అందించాలని సూచించారు. అంతేకాకుండా, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రానికి సంబంధించి అందజేస్తున్న కోర్సుల గోడ పత్రికను ఆవిష్కరించారు.

Scroll to Top