భక్తుల్లోనే భగవంతుని సేవ చూద్దాం

Sakshitha news

భక్తుల్లోనే భగవంతుని సేవ చూద్దాం

** శ్రీవారి సేవకుల ఆత్మీయ సమావేశం లో టీటీడీ చైర్మన్

సాక్షిత ప్రతినిధి – తిరుమల: టీటీడీ ఆలయాల్లో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భంధువులని… భక్తులకు సేవ చేయడం ద్వారా భగవంతుని సేవకు పాత్రులు కావాలని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు కోరారు.
తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తానని తెలిపారు.
దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీవారి సేవకుల సేవా కాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకుగాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు సేవనందిస్తూ భగవంతుని కైంకర్యం చేస్తున్న శ్రీవారి సేవకులు ఎంతో అదృష్టవంతులన్నారు.
తమ సందేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భగవంతునికి – భక్తునికి మధ్య అనుసంధానకర్తలుగా శ్రీవారి సేవకులు తమ సేవలు అమోఘంగా అందిస్తున్నారు. పని వేళలతో పని లేకుండా నిరంతరం భక్తుల సేవలో అహర్నిశలు శ్రమించే టీటీడీ ఉద్యోగులకు ప్రతి విభాగంలోనూ నేడు శ్రీవారి సేవకులు వెన్నుదన్నుగా ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారన్నారు.
సీవీఎస్వో మురళీ కృష్ణ శ్రీవారి సేవకుల సేవలు గణనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్వో ఫణి కుమార్ నాయుడు, సీపీఆర్వో టి.రవి, తిరుమల పీఆర్వో నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.