డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే భూమన విచారణ
** తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ధ్వజం
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నదని, అందులో భాగంగానే తమ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీకి సంబంధించిన గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో భూమనను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారని తెలిపారు. పోలీసుల విచారణకు వెళ్లిన భూమన వెంట, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా నడిచారు. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని ఆయన గుర్తు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకోడానికి, వాస్తవాల్ని బయటపెట్టిన భూమనను విచారణ పేరుతో వేధించడం సబబు కాదని తప్పు పట్టారు.
అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు, అందుకు విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో వేర్వేరు సంఖ్యలు చెప్పారన్నారు. గోవుల మరణాలపై పాలకుల్లోనే స్పష్టత లేదని ఎంపీ గుర్తు చేశారు. విచారణ పేరుతో గంటల తరబడి విచారించడం తగదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, నకిలీ మద్యం తయారీ తదితర అంశాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే భూమనను విచారణకు పిలిచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన పద్ధతుల్ని మానుకుని, హామీల అమలుకు ముందుకు రావాలని గురుమూర్తి డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
