కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద మీడియా సమావేశం
మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి ప్రతినిధులతో కలిసి కొంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విభేదాలు ఉన్నట్లు చిత్రీకరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర నాయకులతో సఖ్యతగా వ్యవహరిస్తూనే, రాష్ట్రానికి వచ్చాక భిన్నంగా మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని అన్నారు.
ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత దాని పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని, అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి, ఆ ప్రాంత ప్రజలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేయకుండా కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు.
మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి చేపట్టే ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
