స్వార్థ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మాణం..

Sakshitha news

స్వార్థ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మాణం..

రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మాణం….

–విప్ విజయరమణరావు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి,
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాల కోసమే నిర్మించారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన్ గార్డెన్స్‌లో మంగళవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత నాలుగు రోజులుగా బీఆర్‌ఎస్ నాయకులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశంపై రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలకు బాగా తెలుసని అన్నారు.

రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించారని, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గురుత్వాకర్షణ పద్ధతిలో నీటిని తరలించే విధంగా రూపకల్పన చేశారని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కింది నుంచి పైకి నీటిని ఎత్తిపోసే విధానాన్ని అమలు చేశారని విమర్శించారు. ప్రతి ఏడాది 180 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నామని ప్రచారం చేసినా, ఐదేళ్లలో వాస్తవంగా చాలా తక్కువ నీరే ఎత్తిపోశారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ మానస పుత్రికగా, ప్రపంచంలో ఎనిమిదో వింతగా ప్రచారం చేస్తూ ప్రజలను ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లి చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, వరద కాలువల ద్వారా రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించి రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించేలా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

దేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు హయాంలో వరద కాలువలకు శంకుస్థాపన జరిగిందని, అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వాటిని పూర్తి చేసి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు జీవం పోశారని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాలువల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

ఎండాకాలంలో ప్రారంభించిన ప్రాజెక్టులు వర్షాకాలంలోనే కూలిపోయే పరిస్థితిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమని విమర్శించారు. హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు కూడా కూలిపోయాయని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రశ్నించిన అప్పటి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును అడ్డుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా పెద్దపల్లి, ధర్మారం, మంథని ప్రాంతాలకు సాగునీరు అందించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు తదితర ప్రధాన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే నిర్మాణమయ్యాయని, ఇప్పటికీ అవి పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.

ప్రజలకు అసత్యాలు చెప్పడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే సూచనలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాయకులకు హితవు పలికారు. హరీశ్‌రావు కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పినా, ఆ హామీలు నెరవేరలేదని విమర్శించారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top