చెన్నూరు యువతకు ఉద్యోగాలే లక్ష్యం….

Sakshitha news

చెన్నూరు యువతకు ఉద్యోగాలే లక్ష్యం….

అవకాశాలను అందిపుచ్చుకోవాలి….

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, చెన్నూరు చెన్నూరు ప్రాంత యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో ఎంపికై రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరులో ఏర్పాటు చేసిన కాకా ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు.

ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతిభ ఉన్న యువతకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఫౌండేషన్ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.

చెన్నూరు నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువే యువత భవిష్యత్తుకు బలమైన పునాది అని, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి కుటుంబానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కేసులు కాదు.. ఉద్యోగాలు కావాలి
ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కీలకంగా నిలిచిన “నీళ్లు, నిధులు, నియామకాలు” లక్ష్యాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. యువతను రాజకీయంగా రెచ్చగొట్టడం కాకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు.

విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందాలని యువత భావించడాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. “యువతకు కేసులు కావాలా.. ఉద్యోగాలు కావాలా?” అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక్కరే అమెరికా వెళ్లాలా? తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలు చేయకూడదా? అని ప్రశ్నించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో TOMCOM ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ తెలిపారు.

ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది.. వాటిని అందిపుచ్చుకుని జీవితాలను మార్చుకోవాల్సిన బాధ్యత యువతదే అని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ప్రతి యువకుడు, యువతి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అధికారులు, కాకా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, యువత, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.

Scroll to Top