క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’ను జయప్రదం చేయాలి.

Sakshitha news

క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’ను జయప్రదం చేయాలి…

కార్పొరేట్ అనుకూల విధానాలు, నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం…

–పీవైఎల్…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, అంతర్గాం/ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న.జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) పిలుపునిచ్చింది.

అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో పీవైఎల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు.

ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తున్న నీట్ నిరుద్యోగ విద్యార్థి, యువతపై లాఠీచార్జి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువతతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాల కారణంగా దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని అన్నారు.

ఎఫ్‌టీఏలు, నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి..
1942లో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలకులను దేశం విడిచి వెళ్లాలని నాటి స్వాతంత్ర్య సమరయోధులు పోరాడి స్వాతంత్ర్యం సాధించారని బండి అశోక్ గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో భారత వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

రైతులు, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు), కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమానికి రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో పీవైఎల్ నాయకులు దూలం సతీష్, బండి అశోక్, ఈదునూరి బాబు, కోడిపుంజుల శ్రావణ్, బండి శ్రావణ్, బండి సతీష్, తూల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top