ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైనన్ని లారీల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించిన

Sakshitha news

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైనన్ని లారీల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించిన …….…అదనపు రెవెన్యూ కలెక్టర్ వినోద్ కుమార్

సాక్షిత వనపర్తి :
జిల్లాలోని ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైనన్ని లారీలను అందుబాటులో ఉంచి, ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ వరి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా, సహా పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, వీసీ ద్వారా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద లారీల అందుబాటు, ధాన్యం రవాణా ప్రక్రియ, తదితర అంశాలపై సెంటర్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇప్పటికి ఎన్ని లారీ లు వచ్చాయి, ఇంకా ఎన్ని లారీలు అవసరం ఉన్నాయనే వివరాల్ని ఆరా తీశారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైనన్ని లారీలను అందుబాటులో ఉంచి, రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ అవసరం మేరకు వాహనాలను సమాకూర్చాల్సిందేనని ఆదేశించారు. ప్రస్తుత అవసరాల మేరకు నిర్దేశించిన కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీ లను పంపాలని ఆదేశించారు. అవసరమైతే సిమెంట్, ఇసుక లారీలను కూడా సమకుర్చుకోవాలని సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వేగవంతంగా రవాణా నిర్వహించాలని, రవాణా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ విషయం లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలనీ, పోలీస్ అధికారుల సమన్వయంతో అన్లోడింగ్ చేయించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు.

అదేవిధంగా, కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేవలం ఆయా కేంద్రాలకు కేటాటించిన మిల్లులకు మాత్రమే తరలించాలని, అలా కాదని ఇష్టం ఉన్నట్లు వ్యవహరించి, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే ట్రక్ షీట్ తెప్పించుకొని రైతులకు ఖాతాల్లో వేగంగా నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా మేనేజర్ ఆంజనేయులు, జిల్లా రవాణా శాఖ అధికారిని మానస, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు, ఇతర అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Scroll to Top