కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల భరోసా….
సింగరేణి సంక్షేమంలో సరికొత్త అధ్యాయం 45 కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రమాద బీమా పథకం…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో అమలవుతున్న కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకం కార్మిక కుటుంబాలకు ఆర్థిక రక్షణ కవచంగా మారింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ చర్యగా నిలిచిన ఈ పథకం ద్వారా ఇప్పటికే 45 మంది కార్మికుల కుటుంబాలకు సుమారు రూ.41 కోట్ల బీమా సొమ్ము అందింది.
అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి నుంచి రూ.1.25 కోట్ల వరకు బీమా సొమ్ము అందజేస్తున్నారు. ప్రమాదాల్లో పాక్షిక లేదా శాశ్వత వైకల్యం పొందిన ఉద్యోగులకు కూడా ఇదే స్థాయిలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అదేవిధంగా సహజ మరణానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బీమా సదుపాయం అందుబాటులో ఉంది.
2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. సింగరేణి ఉద్యోగులు తమ జీత ఖాతాలు కలిగిన బ్యాంకుల ద్వారా ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో పలు బ్యాంకులు ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. సింగరేణి ఉద్యోగులతో పాటు పొరుగు సేవల సిబ్బందికి కూడా ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా వర్తించేలా చర్యలు చేపట్టడం విశేషం.
అదనంగా నామమాత్రపు ప్రీమియంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల జీవిత భద్రతతో పాటు ఆరోగ్య భద్రతకు కూడా భరోసా లభిస్తోంది.
ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కార్మికులు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

