ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో జరుగుతున్న నేషనల్ హైవే పనుల పరిశీలన

Sakshitha news

గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు ఆటంకాలు లేకుండా చర్యలు
టైటిల్ క్లియర్ ఉన్న రైతులకు పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలి….

—కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి నిర్మాణ పనులు సజావుగా కొనసాగేలా చూడాలని సూచించారు.

ముత్తారం తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో నెలకొన్న సమస్యల కారణంగా క్షేత్రస్థాయిలో పనులకు కొంత ఆటంకం ఏర్పడుతున్నట్లు నేషనల్ హైవే అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

పోతారం, సర్వారం, ఓడేడు, లక్కారం ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితులతో కలెక్టర్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టైటిల్ క్లియర్‌గా ఉన్న రైతులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నేషనల్ హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా రెవెన్యూ, నేషనల్ హైవే తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను రైతులతో చర్చించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.

రైతులు, నిర్వాసితుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, సమస్యల కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. రైతులు, నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

పోతారంలో హైవే నిర్మాణ పనుల పరిశీలన:-
అనంతరం ముత్తారం మండలం పోతారం గ్రామంలో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు, నిర్వాసితులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ హైవే నిర్మాణ పనులు సజావుగా కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంథని ఆర్డీఓ సురేష్, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్, ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు, పోతారం, సర్వారం, ఓడేడు, లక్కారం ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top