ఫేక్ మెయిల్స్ బెదిరింపులపై” నిఘా పెంచండి సారూ…
** అర్బన్ ఎస్పీకి బీజేపీ నేత నవీన్ కుమార్ విన్నపం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నగర ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు… విఐపి ప్రముఖులకు ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపుల ద్వారా గందరగోళం సృష్టిస్తూ పోలీసు ఉన్నతాధికారులకు, నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉన్మాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బిజెపి సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన తిరుపతి వీవీ మహల్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర… రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి, అదనపు పోలీస్ బలగాలను 24/7 డేగ కన్నులా ఆధ్యాత్మిక నగరాన్ని మోహరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
తిరుపతి నగరానికి వస్తున్న ఫేక్ మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయన్నారు, తిరుపతికి గత ఏడాదిగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదని….దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొందన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ ఎన్జీవోస్ కాలనీ సమీపంలోని ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్ కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేశాయని పేర్కొన్నారు. “ఆపరేషన్ సింధూర్”
సమయంలో ప్రముఖ ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఒక కుటుంబాన్ని బాంబు వేసి పేల్చి వేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చిందని,
ఈ మేరకు అలిపిరి పిఎస్ లో కూడా కేసు నమోదయిందన్నారు.
గతంలో ఎయిర్పోర్ట్ లతో మొదలైన బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్స్ ఇప్పుడు హోటల్స్ కు, ఆలయాలకు వస్తుండడంతో ప్రజలలో అలజడి నెలకొందన్నారు.
టెంపుల్ సిటీ లో అసలు ఈ ఫేక్ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏఏ అకౌంట్స్ నుంచి పోస్టు చేస్తున్నారు, ఐడి లేంటి, అడ్రస్సులెక్కడ అన్న దానిపై సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
నగరంలోని కొన్ని వెబ్ సెంటర్లలో ఫేక్ ఐడి తో మెయిల్ క్రియేట్ చేసి తప్పుడు సమాచారం పంపించి వెంటనే దానిని డిలీట్ చేసేస్తున్నారని… అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వెబ్ సెంటర్ నిర్వాహకులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫేక్ మెయిల్స్ ద్వారా సైబర్ క్రైమ్ కు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్న ఉన్మాదులను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి గుర్తించడం పోలీసులకు కూడా సవాలుగా మారిపోయిందన్నారు.
మరోవైపు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఎప్పటినుంచో ఉన్న ఐబి హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ, మరోవైపు ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న ఫేక్ మెయిల్స్ పై ఆరా తీస్తున్నాయనీ తెలిపారు. అయితే తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నగర ప్రజలకు, భక్తులకు భరోసా ఇచ్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోందన్నారు. తిరుపతి నగరంలో అసాంఘిక కార్యక్రమాల సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమవుతుందని… “డ్రోన్ కెమెరాస్” తో మారుమూల మత్తు పదార్థాలు, గంజాయి తీసుకొంటున్న యువతను కనుగొని పట్టుకోవడం అభినందనీయం అన్నారు.
ఈ నేపథ్యంలో ఫేక్ మెయిల్స్ పై కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా పెంచి భద్రతను మెరుగు పరచాలని నవీన్ కుమార్ రెడ్డి విన్నవించారు.
