ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదే
జిల్లాలో వేరుశెనగ, మినుములు, కందులు, ఆయిల్‌పామ్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలి.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గుడిసెల్లో నివసించే వారికి ఇండ్ల మంజూరు, రూఫ్ రీప్లేస్మెంట్ వేగవంతంగా అమలు చేయాలి: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్
సాక్షిత వనపర్తి
ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్ళించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని, పంటల మార్పిడి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్ ఆదేశించారు. జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్ వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా అధికారులతో ఎల్‌నినో పరిస్థితులు, పంటల మార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో వర్షపాతం, ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే -18 శాతం వర్షపాతం లోటు (డెఫిసిట్) నమోదైనట్లు అధికారులు వివరించారు. నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉందని, జూరాల ఆయకట్టు కింద ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాలు ఉండగా ఒకసారి నీటి నింపుదలతో సుమారు 10 శాతం(50వేల ఎకరాలకు మాత్రమే) ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు.
దీనిపై స్పందించిన ఎండీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొద్ది రోజులు వర్షం పడిందని రైతులు వరి పంట వేసేందుకు మొగ్గు చూపితే, రానున్న వాస్తవ పరిస్థితులు వారికి తెలియజేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళే విధంగా కృషి చేయాలన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి పంటల మార్పిడిపై లక్ష్యాలు నిర్దేశించి వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
జిల్లాలో వేరుశెనగ, మినుములు, కందుల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేరుశెనగ సాగు విస్తీర్ణాన్ని 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు, మినుముల సాగును 30 వేల ఎకరాలకు పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యానవన శాఖ పనితీరును సమీక్షిస్తూ జిల్లాలో ఆయిల్ పామ్ లక్ష్యాలపై ఉద్యాన శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని ఏడాదికి 6 వేల ఎకరాలకు పెంచాలని, అలాగే 7 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును సమీక్షించారు. జిల్లాలోని అన్ని గుడిసెలను ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు రూఫ్ రీప్లేస్మెంట్ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రూఫ్ రీప్లేస్‌మెంట్‌కు అర్హులైన కుటుంబాలను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎల్-1 జాబితాలో అర్హులైన కుటుంబాల వివరాలను ఉన్నతాధికారుల లాగిన్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మిషన్ భగీరథ అధికారులను ఉద్దేశించి కేవలం ప్రస్తుత పరిస్థితులను మాత్రమే అంచనా వేయకుండా, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, జిల్లా ప్రణాళికాధికారి (సీపీఓ) హరికృష్ణ, వ్యవసాయ, ఉద్యానవన, సాగునీటి, గృహ నిర్మాణ, మిషన్ భగీరథ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


