ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అవినీతి జరుగుతోందని మాజీ కార్పొరేటర్ ఆరోపణ….
లబ్ధిదారుల నుంచి లక్ష రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్నారని నగునూరి సుమలత రాజు విమర్శ….
అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్….
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి,గోదావరిఖని/
రామగుండంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భారీ అవినీతి జరుగుతోందని రామగుండం నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆరోపించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన పథకం అధికార పార్టీ నాయకులకు అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని ఆమె విమర్శించారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న పేదల నుంచి ఇల్లు మంజూరు పేరుతో ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాన్ని కొందరు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో మంజూరైన ఇళ్లను మళ్లీ చూపిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రైవేటు గృహ నిర్మాణాల విషయంలో కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
నగరపాలక సంస్థలో అవినీతిపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు చేసిన వారిని విమర్శించడం సరికాదని, గతంలో తానే అవినీతిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవినీతి జరగలేదని సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రజల సమక్షంలో ప్రమాణం చేయాలని ఆమె సవాల్ విసిరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదల ప్రయోజనాలను కాపాడాలని, లేకపోతే బాధితులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు హెచ్చరించారు.


