హైడ్రా అన్ని రాష్ట్రాలకు అవసరం
బతుకమ్మ కుంటను సందర్శించిన ఢిల్లీ మున్సిపల్ బృందం
3 నెలల వ్యవధిలో చెరువు నిర్మాణం అపూర్వం
చెరువు ఇన్లెట్, ఔట్లెట్లను పరిశీలించిన అధికారులు
🔷హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మున్సిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. అప్పుడే చెరువులు, నాళాలు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది.
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను ఢిల్లీ మున్సిపల్ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం సందర్శించింది.
చెరువు చుట్టూ తిరుగుతూ.. అభివృద్ధిని దశలవారీ తెలుసుకుంది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రాంతం చెరువులా రూపాంతరం చెందడాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
ఈ చెరువు నిర్మాణం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీ మున్సిపల్ హార్టికల్చర్ విభాగం అధిపతి డా. ఆశిష్ అన్నారు.
కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించడం.., మండు వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చిన వీడియోలను పరిశీలించారు.
చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో కూడా చెరువులు చాలవరకు కబ్జాకు గురి అయ్యాయని… హైడ్రా వంటి సంస్థతో వాటిని పునరుద్ధరించడం, పరిరక్షించడం సులభం అవుతుందని అన్నారు.
🔷 ప్రయోజనాలపై ఆసక్తి..
ఈ చెరువు లేనప్పుడు వరద ప్రభావం ఎలా ఉంది… యిప్పుడు ఎలా ఉంది అనే అంశంపై ఢిల్లీ బృందం ఆరతీసింది.
చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాలువలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడాన్ని పరిశీలించింది.
ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు బృందానికి చూపించారు.
ఈ వరద నీరు గతంలో ఎటు వెళ్లేదని.. స్థానికులతో కూడా మాట్లాడి ఈ బృందం తెలుసుకుంది.
వరద నీరు తమ బస్తీలను, కాలనీలను ముంచెత్తేది.. ఈ సారి ఆ ముప్పు తప్పిందని వారంతా పేర్కొన్నారు. చెరువు ఔట్‌లెట్లను కూడా ఈ బృందం పరిశీలించింది.
హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, చెరువులను అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్ ఎండీ పి. యూనస్‌తో పాటు హెచ్ఎండీఏ, ASCI అధికారులు కూడా ఢిల్లీ బృందంతో పాటు బతుకమ్మకుంట ను సందర్శించినవారిలో ఉన్నారు.
