ఓసీపీ-3 ఓబీ మట్టి తరలింపులో భారీ అక్రమాలు.. సింగరేణికి కోట్ల రూపాయల నష్టం….

Sakshitha news

ఓసీపీ-3 ఓబీ మట్టి తరలింపులో భారీ అక్రమాలు.. సింగరేణికి కోట్ల రూపాయల నష్టం….

విజిలెన్స్‌తో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ డిమాండ్….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం ఏరియా-2 పరిధిలోని ఓసీపీ-3లో ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి తరలింపు పనుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, దీనివల్ల సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ, ఫేజ్-2లో వి9 (V9) సంస్థకు ఓబీ మట్టి తరలింపు కాంట్రాక్టు లభించిందని, టెండర్ నిబంధనల ప్రకారం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని ఎక్స్‌టర్నల్ డంప్ యార్డుకు మట్టిని తరలించాల్సి ఉండగా, వాస్తవానికి కిలోమీటర్ లోపే ఉన్న ఇంటర్నల్ డంప్ ప్రాంతంలో మట్టిని పోస్తున్నారని ఆరోపించారు.

ఒక్కో క్యూబిక్ మీటర్ మట్టి తొలగింపు, రవాణా, డంపింగ్ కోసం సింగరేణి రూ.55 చెల్లిస్తోందని, అయితే టెండర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తక్కువ దూరంలోనే మట్టిని డంప్ చేసి, ఎక్స్‌టర్నల్ డంపింగ్ చేసినట్లు రికార్డులు సృష్టిస్తూ కాంట్రాక్టర్‌కు అక్రమ లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రెండేళ్లలో సుమారు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించగా, అందులో కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినే ఎక్స్‌టర్నల్ డంప్ యార్డుకు తరలించినట్లు రికార్డులు ఉన్నాయని, మిగిలిన 33 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎక్కడ డంప్ చేశారో స్పష్టమైన వివరాలు లేవని అన్నారు. ఇంటర్నల్ డంపింగ్ చేసిన మట్టిని ఎక్స్‌టర్నల్ డంపింగ్‌గా చూపిస్తూ రవాణా, డీజిల్, నిర్వహణ ఖర్చుల పేరుతో బిల్లులు చెల్లించడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ అక్రమాల వల్ల వి9 కంపెనీకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అక్రమ లాభం చేకూరే అవకాశం ఉందని, అదే స్థాయిలో సింగరేణికి నష్టం వాటిల్లుతోందని దినేష్ తెలిపారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రధాన అధికారులు కూడా ప్రయోజనం పొందుతున్నారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వి9 సంస్థ వద్ద సుమారు 35 డంపర్లు, 35 వోల్వో వాహనాలు, 10 స్కానియా ట్రక్కులు పనిచేస్తున్నాయని, వీటిలో అధిక సంఖ్యలో వాహనాలు ఇంటర్నల్ డంపింగ్‌కే వినియోగిస్తున్నప్పటికీ, ఎక్స్‌టర్నల్ డంపింగ్‌గా చూపిస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని డంప్ యార్డుకు ఒక ట్రిప్ పూర్తి చేయడానికి సుమారు 40 నిమిషాల సమయం పడుతుండగా, ఇంటర్నల్ డంపింగ్ వల్ల కేవలం 10 నిమిషాల్లోనే పని పూర్తవుతోందని వివరించారు.
ఫేజ్-2లో వి9 సంస్థ నిర్వహిస్తున్న ఓబీ మట్టి రవాణా పనులపై విజిలెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని, యాజమాన్యం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. సంస్థకు నష్టం కలిగించిన వారిపై, అలాగే అక్రమాలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Scroll to Top