గూడూరును ప్రత్యేక జిల్లా చేయాలి

Sakshitha news

గూడూరును ప్రత్యేక జిల్లా చేయాలి

** లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి

** భారీ ర్యాలీలో “వాకర్స్ హెల్త్ క్లబ్” అధ్యక్షులు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి / గూడూరు: ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును కూటమి ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా ప్రత్యేక జిల్లాగా చేయాలని….. లేకుంటే గతంలో మాదిరి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని “వాకర్స్ హెల్త్ క్లబ్” అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో గూడూరులో వాకర్స్ సంఘాలు, క్రీడాకారుల అసోసియేషన్లు ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా ప్రదర్శన చేపట్టారు. “వాకర్స్ హెల్త్ క్లబ్” అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారు చెప్పిన అన్ని పథకాలు, హామీలు అమలు పరుస్తూ ఉన్న నేపథ్యంలో వారు ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. గతంలో శాసనసభలో గూడూరు ఎమ్మెల్యే గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీలోనే ఉన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించటం శుభ సూచకం అన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పేర్లు, భౌగోలిక ప్రాంతాల చేర్పులు – మార్పులు చేపట్టిన దరిమిలా గూడూరును ప్రత్యేక జిల్లా చేసినట్లయితే అందరికి సౌకర్యం కలుగుతుందన్నారు.

అంతేగాక గూడూరులో ప్రధానంగా రైల్వే డివిజన్, రెవెన్యూ డివిజన్, నిమ్మకాయల వ్యాపారం ఉన్నాయని, చిల్లకూరు మండలం పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని గూడూరును జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అన్ని వనరులు పరిపూర్ణంగా గూడూరులో ఉన్నందున ప్రత్యేక జిల్లాగా చేయమని గూడూరు ఎమ్మెల్యే తరపున కోరుకుంటున్నట్లు వాకర్స్, క్రీడాకారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గూడూరు నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజలు తిరుపతికి వంద కిలోమీటర్లు పైగా వెళ్లి రావాలంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఏదైనా సమస్య తీసుకుపోవటానికి ఒకరోజు గడచిపోతుందని…. అందువల్ల ఆర్థికంగా నష్టం జరుగుతున్నదని చెప్పారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని గతంలో ఉన్నట్లుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో గూడూరును కలిపినట్లయితే అందరికీ అనుకూలంగా ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లతో వెంటనే చర్చించేలా గూడూరు ఎమ్మెల్యే చొరవ తీసుకొని గూడూరును జిల్లాగా అయినా ప్రకటింప చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, పీవీకే శర్మ, సుమన్ రెడ్డి, కోటేశ్వరరావు, మస్తాన్, సాయి, మునీఫ్, శశిధర్, మొబైల్ రాజా, ప్రసాద్, చిన్నారావు, రజనీకాంత్, హగ్గయ్య, సందీప్, ఇమ్రాన్ ఇతర క్రీడాకారులు, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.