గోదావరి పుష్కరాలు–2027కు భారీ రవాణా ఏర్పాట్లు….
మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలకు మరింత బలం: మంత్రి పొన్నం ప్రభాకర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంథని, గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలోని మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలను నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామం నుంచి పుష్కర క్షేత్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న బస్టాండ్లను ఆధునికీకరించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతర తరహాలో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు.
గత పదేళ్లలో కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు, డిపోల ఏర్పాటు వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తుండగా, బస్సులు రోజుకు 35 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉన్న పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని, మంథని బస్టాండ్ ఆధునికీకరణతో పాటు పెద్దపల్లి బస్ డిపోను కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డీవో సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

