మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డివి దిగజారుడు మాటలు

Sakshitha news

మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డివి దిగజారుడు మాటలు

** మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కూడా వైసీపీ ఓడిపోయాక మతి భ్రమించి దిగజారుడు మాటలతో కాలం గడుపుతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివంలతో కలసి లీలామహల్ సమీపంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మిక సంస్థలో స్వచ్ఛమైన భక్తి, భక్తుల సేవ అంటే బిఆర్ నాయుడుని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ పాలకమండలి అధ్యక్షులుగా పనిచేసిన సందర్భంలో ఎలాంటి పాలన చేసాడో యావత్త్ భక్తజనం నేరుగా చూశారని వ్యాఖ్యానించారు. అలాంటి కరుణాకర్ రెడ్డిది బిఆర్ నాయుడు గురించి మాట్లాడే స్థాయి కాదని, గత ప్రభుత్వంలో దేవస్థానం చైర్మన్ గా చేసిన సందర్భంలో తిరుమల పవిత్రతను పూర్తిగా మంట కలిపారని విమర్శించారు. ముఖ్యంగా వేంకటేశ్వర స్వామికి అతి ప్రీతికరమైన లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో కూడా కల్తీ చేసిన ఘనత వైసీపీ నాయకులకు, కరుణాకర్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే వైసీపీ హయాంలో స్వామి దర్శన టికెట్లను కూడా అమ్మిన ఘనత వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలకే చెందుతుందని ఎద్దేవా చేశారు. అన్నీ అరాచకాలకు పాల్పడి ఇప్పుడు వేంకటేశ్వర స్వామి పవిత్రతను గురించి మాట్లాడడం… దెయ్యాలు వేదాలు వల్లించడమే అని తీవ్రంగా దుయ్యబట్టారు. బిఆర్ నాయుడు స్థాయి గురించి మాట్లాడడం కరుణాకర్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.

కూటమి పాలనలో ఐఏఎస్ ఆఫీసర్ అయినా…చైర్మన్ అయినా… అటెండర్ అయినా…. దబేదారు అయినా…. అందరూ ఆ వెంకన్న బిడ్డలే అని దేవుడికి సేవ చేయడం కోసమే ఎంతటి వారైనా భగవంతుడి ముందు సమానమని తెలిపారు. ఒక బాధ్యతాయుతమైన చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి ప్రెస్ ముందు సూక్తులు, వేద వాక్యాలు వల్లీస్తూ…. దిగజారిన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మీ పాలనలో లాగా మీకు కప్పం కట్టే వారికి పెద్దపీట వేయడం…. కూటమి ప్రభుత్వంలో చెల్లదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన భోజనంతో పాటు వడ ప్రసాదం కూడా ఇస్తున్న సంగతి మీకు తెలియదా… కనబడలేదా…. అని నిలదీశారు. మీ హయాంలో అన్నదాన సత్రంలో ఆకలితో వచ్చిన భక్తులు మీరు పెట్టే నాసిరకం భోజనం తినలేక ఆకలితో తిరిగి వెళ్లిపోయిన సందర్బం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఒక బాధ్యతా యుతమైన మాజీ దేవస్థానం చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి బాంబుల సంస్కృతిని అందరికీ ఉన్నట్లు మాట్లాడడం…. ఆయన ఒక్కడే మేధావిలాగా ముసుగు కప్పుకొని మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం, శంకర్, శ్రీరాములు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.