తెలంగాణలో జిల్లా కమిటీల ఏర్పాటు..
సోషల్ మీడియా, విద్యార్థి అవుట్‌రీచ్, ప్రజా చైతన్య కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
వన్ నేషన్–వన్ ఎలక్షన్ పై తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర సమన్వయ సమావేశంలో జిల్లా కమిటీల ఏర్పాటు, సోషల్ మీడియా ప్రచార బృందాల ఏర్పాటు, విద్యార్థి అవుట్‌రీచ్ కార్యక్రమాలు, వక్తల శిక్షణ తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ జీ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు సహాధ్యక్షులుగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రారంభోపన్యాసం చేసి వన్ నేషన్–వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
ప్రతి జిల్లాలో ఒక కన్వీనర్, ముగ్గురు సహ-కన్వీనర్లతో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీలో తప్పనిసరిగా ఒక మహిళా ప్రతినిధి, ఒక యువజన ప్రతినిధి, ఒక సోషల్ మీడియా ప్రతినిధికి చోటు కల్పించాలని సూచించారు.
రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించారు. జోన్–1 రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా శ్రీమతి సోమారావు లావణ్య, మానిటరింగ్ ఇన్‌చార్జ్‌గా శ్రీ మురళీధర్ బాలాను నియమించారు. జిల్లా స్థాయి కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించే బాధ్యత ఈ జోనల్ బృందాలకు అప్పగించారు.
అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసి డిజిటల్ ప్రచారం, కంటెంట్ రూపకల్పన, సోషల్ మీడియా అవుట్‌రీచ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది వక్తల ప్యానెల్‌ను సిద్ధం చేసి, అందులో కనీసం 30 శాతం మహిళలకు అవకాశం కల్పించాలని తీర్మానించారు.
విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు, జిమ్‌లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా వారీగా సభలు, ర్యాలీలు, సోషల్ మీడియా ప్రచారాలు, విద్యార్థి సదస్సులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
