ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి తొలి జత యూనిఫాం….
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తొలి జత పాఠశాల యూనిఫాంలను ఆగస్టు 15 నాటికి తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల యూనిఫాంల కుట్టింపు, పంపిణీ, స్వయం సహాయక సంఘాల పనితీరుపై సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యమైన యూనిఫాంలను నిర్ణీత గడువులోగా అందించాలని ఆదేశించారు. జిల్లాలోని గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాంల పంపిణీ పూర్తి చేసిన స్వయం సహాయక సంఘాల మహిళలను అభినందించారు.
స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్థిరత్వానికి బ్యాంక్ లింకేజ్ రుణాల సకాల చెల్లింపులు కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఏ సంఘం కూడా నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా మారకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి స్వయం సహాయక సంఘానికి రూ.15 లక్షలకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణం అందేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ సంఘం (వి.ఓ) పరిధిలో కనీసం రెండు ఫామ్‌పాండ్లు నిర్మించాలని, ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు ఫామ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని మహిళలకు వివరించాలని ఆదేశించారు.
ప్రతి 10 వేల స్వయం సహాయక సంఘాల క్లస్టర్‌కు ఒక బుక్‌కీపర్‌ను నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. సంఘాల ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా బుక్‌కీపర్ల సామర్థ్యాన్ని మరింత పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు డీఆర్‌డీఏ రవీందర్, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ దుర్గాప్రసాద్, ఏపీఎంలు, సెర్ప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
