రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: ఏఈఓ జానయ్య
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నూతనకల్ క్లస్టర్ పరిధిలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి బి. జానయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల వారీగా రైతులను వారి ఇళ్ల వద్ద సంప్రదించి, అగ్రి స్టాక్ యాప్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేపట్టారు. వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్, క్రాప్ బుకింగ్, డిజిటల్ క్రాప్ సర్వే, వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోలు, పీఎం కుసుం వంటి పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని ఆయన తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పథకాలకూ ఇది ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
నూతనకల్, చిల్పకుంట్ల, ఎర్ర పహాడ్ గ్రామాలలో మొత్తం 2,625 మంది పట్టాదారు రైతులు ఉన్నారని, అందులో ఇప్పటివరకు 1,725 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఇంకా 900 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులు ప్రభుత్వ పథకాల లబ్ధులకు అనర్హులవుతారని హెచ్చరించిన ఆయన, వెంటనే రైతు వేదికల వద్ద లేదా కామన్ సర్వీస్ సెంటర్ ఎన్యూమరేటర్ల ద్వారా మొబైల్, ఆధార్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో నమోదు పూర్తి చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 31, 2026 మాత్రమే ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బండపల్లి కిషన్, భూ రెడ్డి మధుకర్ రెడ్డి, గుండెబోయిన సతీష్, గాజబోయిన సైదులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
