రామగుండంలో ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు…
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలి…
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి,
రామగుండం నియోజకవర్గంలో పేద ప్రజలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయడమే లక్ష్యమని, ఇందుకోసం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ గృహ వసతి కల్పించే దిశగా చేపడుతున్న చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఎల్-1 (L1), ఎల్-2 (L2) దరఖాస్తులను గెజిటెడ్ అధికారులు రాబోయే రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మొదటి, రెండవ దశల్లో ఇందిరమ్మ కమిటీల నుంచి అందిన జాబితాను చాలా జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రస్తుతానికి గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. నగరాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూడాలని కోరారు.
నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి, ఎల్-2 జాబితాలో ఉన్న అర్హులను ఎల్-1కు పంపడం ద్వారా అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఆర్డీవో గంగయ్య, ఈ. డి. యం.కవిత,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
