జగన్ పాపాల పాలన.. నేటికీ పేదల్ని శాపంలా పీడిస్తోంది : ప్రత్తిపాటి
- గత అవినీతి మంత్రి డబ్బుకోసం చిలకలూరిపేటలో చేసిన పాపాలు ప్రజల్ని ఇప్పటికీ వేధిస్తున్నాయి.
- ధనార్జనే ధ్యేయంగా దిగువ, మధ్యతరగతి ప్రజల్ని అక్రమ లేఅవుట్లతో మోసగించి ముఖం చాటేశారు.
•భూములపై గీతలు గీసి, ప్లాట్లని చెప్పి కనీస వసతులు లేకుండానే ప్రజలకు అంటగట్టారు.
- 167 ఏ జాతీయ రహదారి విస్తరణకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారు.
- నేటి మార్కెట్ ధర ప్రకారం పరిహారం నిర్ణయిస్తే రైతులకు మేలు జరిగేది.
- ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
167 ఏ జాతీయ రహదారి విస్తరణతో రైతులకు జరిగిన నష్టం గత పాలకుల పాపాల ఫలితమేనని, రోడ్ల కోసం భూములు, స్థలాలు, ఇళ్లు ఇచ్చిన వారికి అన్యాయం జరగడాన్ని సహించబోమని, అవసరమైతే టోల్ వసూలు కాలపరిమితి పెంచైనా రైతుల్ని ఆదుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) నిర్వహంచిన ప్రత్తిపాటి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ అరాచకాలు, దోపిడీపైనే ఎక్కువ ఫిర్యాదులు..
గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దోపిడీపైనే ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్న ప్రత్తిపాటి, టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో గృహాలను గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో సొంతింటి కోసం ప్రజలు దరఖాస్తులు ఇస్తున్నారన్నారు. కూటమిప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అసంపూర్తిగా ఉన్నఇళ్లను సకాలంలో పూర్తి చేసేలా పనులు ప్రారంభమయ్యాయని ప్రత్తిపాటి చెప్పారు. మార్చి నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు పూర్తవుతుందన్నారు. జగన్ హాయాంలో కేటాయించిన సెంటు పట్టాల కేటాయింపు, జగనన్న కాలనీల నిర్మాణ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉండబట్టే ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
జగన్ పాలన పేదలకు శాపంగా మారింది. పేదల పేరు చెప్పి జగన్ రాష్ట్రాన్నే కొల్లగొట్టాడు.
ఐదేళ్ల జగన్ పాలన పాపాలు పేదలకు శాపంగా మారాయని, పేదల పేరుచెప్పుకొని వారిని ఉద్దరిస్థున్నట్టు ప్రజల్ని నమ్మించిన జగన్, రాష్ట్రాన్నే కొల్లగొట్టాడని దాని ఫలితమే కూటమిప్రభుత్వంలో ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న సమస్యలని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించే గ్రీవెన్స్ లకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడానికి జగన్ దోపిడీ, అవినీతి, అరాచకాలే కారణమన్నారు.
భూములపై గీతలు గీసి ప్లాట్లపేరుతో గత అవినీతి మంత్రి కోట్లు కాజేశారు
చిలకలూరిపేట నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ అవినీతి మంత్రి ధనార్జనే ధ్యేయంగా అక్రమ లేఅవుట్లను పెంచి పోషించారని, కేవలం భూములపై గీతలు గీసి ప్లాట్లు అమ్ము కొని వారి దారి వారు చూసుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు. గత ఐదేళ్లు చిలకలూరిపేట పట్టణానికి చుట్టు పక్కలున్న భూముల్లో అనధికార లేఅవుట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అడ్డగోలుగా సాగాయన్నారు. కాలువలు, డొంకలు, వాగులు, వంకలు సహా చివరకు ప్రభుత్వ భూముల్ని కూడా అమ్మకానికి పెట్టేసి కోట్లు కొల్లగొట్టేసి నేడు ప్రజలకు ముఖం చాటేశారని ప్రత్తిపాటి తెలిపారు. వారు చేసిన పాపాల నుంచి తమను కాపాడాలంటూ భూములు కొన్నవారు దిక్కతోచని స్థితిలో నేడు తమను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. మధ్య, దిగువ తరగతి ప్రజల ఆశల్ని సొమ్ముచేసుకున్న గత పాలకుల్ని ఉపేక్షించేది లేదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్య ఫలితమే 167ఏ జాతీయ రహదారి రైతుల సమస్య..
167 ఏ జాతీయ రహదారి విస్తరణ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం గత ప్రభుత్వంలో పరిహారం నిర్ణయించలేదని, దాంతో వారు ఇప్పుడు న్యాయం చేయమంటున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా, వారికి సంతృప్తికరమైన ధర ఇవ్వాలని, అవసరమైతే టోల్ ఛార్జీలు మరికొన్నాళ్లు పెంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. రైతుల సమస్యలపై కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందని, గతపాలకుల నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కోర్టులు, చట్టాలున్నాయని రైతుల్ని ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తామంటే సమస్య ఇంకా జటిలం అవుతుందన్నారు. భవిష్యత్ లో జరిగే రోడ్దు విస్తరణలో కూడా ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
