ఎన్ఐఆర్డీ సహకారంతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి

Sakshitha news

ఎన్ఐఆర్డీ సహకారంతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి: విజయవాడ ఎంపీ & కేశినేని ఫౌండేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని)
….

సాక్షిత :ఎస్ హెచ్ జి లతో క్లస్టర్ల ఏర్పాటు చేస్తాం: జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్

ఏ.కొండూరు అభివృద్ధికి డిపిఆర్ రూపొందిస్తాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ ఐ ఆర్ డి) భాగస్వామ్యంతో, జిల్లా యంత్రాంగం సహకారంతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు & కేశినేని ఫౌండేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్ ఐ ఆర్ డి, కేశినేని ఫౌండేషన్ అవగాహన ఒప్పందం (ఎం ఓ యు) అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ… వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉపాధి కల్పన అత్యంత కీలకమన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) తో కలసి స్వయం సహాయక సంఘాల కు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. సీడ్ బ్యాంకు, గిరిజన దుస్తులు, ఆభరణాల రూపకల్పన, విస్తరాకులు, వర్మీ కంపోస్ట్ తయారీ మొదలైన వాటికి అవసరమైన యంత్రాలను అందిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ఎ.కొండూరు, జక్కంపూడి ల లో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు.

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ ఐ ఆర్ డి) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ…. భారత ప్రభుత్వం నూతనంగా రూరల్ ప్రాస్పరిటి & రూరల్ రెస్లియన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ అనే ఆలోచన ను సాకారం చేయడానికి కేసినేని ఫౌండేషన్ తో కలసి ఎస్ హెచ్ జి ల కు శిక్షణ ఇస్తామన్నారు. స్వయం సహాయక బృందాలతో మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని, వీటికై క్లస్టర్లు ఉండాలని చెప్పారు. పెద్ద కంపెనీల నుంచి ఎస్ హెచ్ జి లకు ఆర్డర్లు ఇప్పించి అవి ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ… ఏ.కొండూరు, జక్కంపూడిలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఏ. కొండూరు అభివృద్ధికి డిపిఆర్ రూపొందిస్తామన్నారు. ఆకాంక్షిత బ్లాకులకు ఉన్న 40 సూచీలలో 25 సూచీలలో సంతృప్త స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఏ కొండూరు కూడా ఆకాంక్షిత బ్లాకుల తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహమ్మద్ ఖాన్, డి ఆర్ ఒ లక్ష్మీ నరసింహం, డిఆర్డిఏ పిడి నాంచారరావు, డీఎంహెచ్వో సుహాసిని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.