నక్ష” సర్వేలో పొరబాట్లు రానీయొద్దు
** మున్సిపల్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సూచన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్ష (రీసర్వే) కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రీనరీ – బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ అండ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కోరారు. నగరపాలక సంస్థ కచ్చపి ఆడిటోరియంలో “నక్ష” ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని వార్డు ప్లానింగ్, అమెనిటీ సెక్రటరీలు, వి.ఆర్.ఓ లతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిందన్నారు. అందులో తిరుపతి నగరంను కూడా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు ఉండడం వలన జాగ్రత్తగా సర్వే చేయాలని కోరారు. నగరంలోని అన్ని ప్రాపర్టీస్ క్షుణ్ణంగా సర్వే చేసేలా 50 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీరందరూ మీకిచ్చిన టార్గెట్ ను పూర్తి రికార్డు చేయాలని పేర్కొన్నారు. ఈ సర్వే 60 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయాలని తెలిపారు. సర్వేకు వెళ్ళినప్పుడు స్థానిక నాయకులను కలుపుకుని వెళ్లాలని కమిషనర్ సూచించారు. ఈ ఓరియెంటేషన్ (శిక్షణ) కార్యక్రమాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించాలని… ఎవరు ఎటువంటి పొరపాట్లకు పాల్పడినా ఆన్లైన్ భూరికార్డుల తయారీలో ఇబ్బందులు వస్తాయని, జాగ్రత్తగా సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత నగరంలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు అన్ని డిజిటల్ రికార్డింగ్ అవుతాయని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని తెలిపారు. నక్ష సర్వేకి వచ్చిన బృందానికి నగరంలోని అన్ని భవన యజమానులు, స్థల యజమానులు భూ రికార్డు పత్రాలను చూపించి ఆన్లైన్ రికార్డుల్లో మీ స్థలాలను భద్ర పరచుకోవాలని కోరారు.
ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ , రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ పారదర్శకమైన భూ రికార్డులు ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని భూ రికార్డులు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. దేశ వ్యాపితంగా 152 నగరాలు ఆంధ్రాలో 10 నగరాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారన్నారు. అందులో తిరుపతి ఎంపిక కావడం అదృష్టమని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని కోరారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ మెంబర్ చంద్ర, కార్పొరేటర్లు కుమారి, అనిత, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ ఖాన్, తహసీల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఏసిపి లు మూర్తి, మధు, నగరపాలక సంస్థ సిబ్బంది, విఆర్ఓ లు, ప్లానింగ్ సెక్రటరీ లు, తదితరులు పాల్గొన్నారు.
