16 నుంచి ధనుర్మాస తిరుప్పావై…

Sakshitha news

16 నుంచి ధనుర్మాస తిరుప్పావై…

** తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 ఆలయాల్లో క్రతువు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 ఆలయాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్ర‌దేశ్ లో -76, తెలంగాణలో -57, త‌మిళ‌నాడులో – 73, క‌ర్ణాట‌క‌లో – 21, పాండిచ్చేరిలో – 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్ర ఆలయంలలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.

అళ్వారుల ధనుర్మాసం వ్రతం…

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Scroll to Top