దాతలు, భక్తులు ఇచ్చే విరాళాలు మరకత శివాలయం అభివృద్ధి కొరకే
దేవాదాయ శాఖకు ప్రతి రూపాయి లెక్క చూపిస్తాం: ఆలయ ధర్మకర్త (వెంకటేశ్వరరావు) వీడియో రావు
శంకర్‌పల్లి: దాతలు, భక్తులు ఇచ్చే విరాళాలు ఆలయ అభివృద్ధి కొరకే అని ఆలయ ధర్మకర్త (వెంకటేశ్వర రావు) వీడియో రావు అన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ 15 రోజుల కింద దేవాదాయ శాఖ వారు ఆలయానికి చెందిన ఐదు సంవత్సరాల లెక్క చూపమని నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. తాము వారిని మూడు నెలల గడువు కోరామని అడిగినట్టు చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని చెప్పారు. 1983లో తాను శంకర్‌పల్లికి వచ్చానని, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో పురాతన ఆలయం ఉందని తెలుసుకొని 2012లో ఆలయాన్ని గ్రామస్తులతో కలిసి పున:నిర్మించామని తెలిపారు. 2018 నుండి 2023 వరకు చైర్మన్‌గా సదానందం గౌడ్ ఉన్నప్పుడు ఆలయంలో ఉన్న అర్చకులకు పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వడానికి కష్టంగా ఉండేదని, 2020-21లో కోవిడ్ రాగ ఆ సమయంలో ఆలయానికి భక్తులు రాలేక చాలా ఇబ్బందులు పడ్డామని వాపోయారు.
ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా కలిసి చందాలు వేసుకొని ప్రతి పౌర్ణమికి అన్నదానం చేసే వారిమని చెప్పారు. 2024 నుండి భక్తులు పెరగడం, దాతలు ఇచ్చే విరాళాలతో ప్రతి ఆది, సోమ వారాలు, పౌర్ణమికి అన్నదానం చేస్తున్నామని తెలియజేశారు. శివరాత్రి పండగకు, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఉండడానికి వసతి గృహాలు లేక, భక్తులు నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ సహకారంతో ఎనిమిది వందల గజాలు తీసుకొని అన్నదాన సత్రం, వసతి గదులను నిర్మించామని తెలిపారు. గదుల నుండి వచ్చే రుసుమును ఆలయ అభివృద్ధికి వాడుతున్నామని పేర్కొన్నారు. ఆలయం ప్రతి ఒక్కరిదని, ప్రతి ఒక్కరూ ఆలయానికి రావచ్చని, స్వామివారికి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలియజేశారు. స్వామివారి అభిషేకానికి టికెట్టు, అన్నదానానికి కూడా రసీదును భక్తులకు ఇస్తున్నామని పేర్కొన్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర అందజేస్తున్నామని చెప్పారు. ఆలయానికి వివిధ విభాగాల నుండి వచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, సాగర్, సుధీర్ గౌడ్, లీలావతి, విట్టలయ్య, అనంతయ్య, వెంకటస్వామి, నవీన్, అర్చకులు సాయి శివ ప్రసాద్, వీరేష్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY