ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై మ‌క్కువ పెంచుకోండి

Sakshitha news

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై మ‌క్కువ పెంచుకోండి

** ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
….

సాక్షిత ప్రతినిధి – విజయవాడ / తిరుపతి: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు… అన్నదాతకు అండగా నిలిచేందుకు కూట‌మి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని ఏపీ వ్య‌వ‌శాయ శాఖ మంత్రి కింజ‌రపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమ‌వారం కృష్ణ జిల్లా, అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని ఘంట‌సాల గ్రామంలో “రైత‌న్న.. మీకోసం” కార్య‌క్ర‌మాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే డా.మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ తో క‌ల‌సి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఘంట‌సాల గ్రామంలో రైతుల‌కు పంచ‌సూత్ర ప్ర‌ణాళిక ఉద్దేశాన్ని, ఉప‌యోగాల‌ను మంత్రి వివ‌రించారు. ముఖ్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వరకూ “రైతన్నా మీకోసం” పేరుతో కార్యక్రమాలు చేపడ‌తున్నామ‌ని, డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రైతు నిలబడేలా, వ్యవసాయం కొనసాగించేలా ఒక వ్యవస్థ ఉండాలి. రైతుకి భరోసా ఇవ్వగల శాశ్వత పరిష్కారాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారు. ఆ నిర్ణయమే ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం అని పేర్కొన్నారు.

ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలి

రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండటంతో, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతు బలపడితేనే గ్రామం బలపడుతుంది. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. అందుకే ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని తెలిపారు. రైతు ఆదాయం పెంపు, ఇన్‌పుట్ వ్యయాల తగ్గింపు, పంటలకు హామీ ధర, ప్రకృతి విపత్తుల్లో రక్షణ, మార్కెట్ స్థిరీకరణ, శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అందుబాటు లోన్లు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు సేవా కేంద్రాల బలపరచడం వంటి చర్యలు రైతు కుటుంబాల అభివృద్ధి వైపు స్పష్టమైన అడుగులని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు స్వయం సమృద్ధి సాధించే పరిస్థితులను క్రమబద్ధంగా సృష్టిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పంచసూత్రాల ప్రచారం ప్రతి రైతు ఇంటికి

పంచసూత్రాలను ప్రతి రైతు ఇంటికి వెళ్లి, కనీసం 20 నిమిషాల పాటు వివరించేందుకు పెద్దస్థాయి కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్ల‌డించారు. ఈ పంచసూత్రాలు ఏమిటి? రైతుకి ఎలా మేలు జరుగుతుంది? భవిష్యత్తులో ఎలా స్థిర ఆదాయం వస్తుంది? ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది? అనే విషయాలు ప్రతి రైతుకు స్పష్టంగా చెప్పడం మా లక్ష్యమ‌ని తెలిపారు. నీటి పారుదల, రైతు అభివృద్ధికి మొదటి అస్త్రం అని, వ్యవసాయం చేయాలంటే ముందుగా నీరు అవసరం. నీరు లేకపోతే రైతు కష్టమే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నార‌ని వివరించారు. నంద‌మూరి తార‌క రామారావు, సీఎం చంద్రబాబుల హ‌యాంలో నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, వారి కృషి వ‌ల‌నే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలినవన్నీ వేగంగా సాగుతున్నాయని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. పంటలు పండించేటప్పుడు డిమాండ్ ఆలోచించకుండా పక్క రైతును చూసి పంట పెట్టడం, గత సంవత్సరం ధర వచ్చిన పంటను మళ్లీ పెట్టడం వల్ల నష్టం వస్తోందని మంత్రి చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లు పూర్తిగా మారాయని, రాగులు, సజ్జలు, జొన్నలు మళ్లీ డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్యకర ధాన్యాలని, ఈ మార్పును రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రైతన్న మీకోసం కార్యక్రమంపై పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి మండిప‌డ్డారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి ఈరోజు కూట‌మి ప్ర‌భుత్వంపై మాట్లాడటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే డా. మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్, వ్య‌వ‌సాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్ర‌ట‌ర్ బీ.రాజ‌శేఖ‌ర్ (ఎక్స్ ఆఫీషియో), వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌నర్ మంజీర్ జిలానీ సామూన్, కృష్ణా జిల్లా జేసీ ఎం. న‌వీన్, ఆర్టీస్ చైర్మ‌న్ కొన‌క‌ళ్ళ నారాయ‌ణ‌, ఆంగ్రూ ప్ర‌తినిధులు డా. శివ‌న్నారాయ‌ణ‌, డా. దుర్గా ప్ర‌సాద్, విజ్ఞాన్ కృషి కేంద్ర సీనియ‌ర్ సైంటిస్ట్ డా.డి. సుధారాణి, ఘంట‌శాల గ్రామ‌స్తులు, కూట‌మి ప్ర‌భుత్వ శ్రేణులు పాల్గొన్నారు.

Scroll to Top