యూరియా సరఫరా–ధాన్యం రవాణాపై డీసీపీ సమీక్ష…

Sakshitha news

యూరియా సరఫరా–ధాన్యం రవాణాపై డీసీపీ సమీక్ష…

హమాలీల కోసం చలివేంద్రం ఏర్పాటు
పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో యూరియా సరఫరా, ధాన్యం రవాణాపై డీసీపీ సమీక్ష….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రైతులకు అవసరమైన యూరియా ఎరువుల సరఫరా నిరంతరాయంగా కొనసాగడంతో పాటు ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో యూరియా బస్తాల అన్‌లోడింగ్ ప్రాంతాన్ని డీసీపీ సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో పాటు హమాలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించారు.
ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా కోసం పెద్ద సంఖ్యలో లారీలను వినియోగిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న యూరియా ఎరువుల రవాణాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

ఈ అంశంపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో డీసీపీ సమావేశమై చర్చించారు.

వరి, మొక్కజొన్న రవాణా సజావుగా కొనసాగడంతో పాటు రైతులకు అవసరమైన యూరియా సరఫరా కూడా నిలిచిపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. యూరియా బస్తాల సరఫరా ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా పరస్పర సహకారంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా రైల్వే వ్యాగన్ల నుంచి యూరియా బస్తాలను లారీలలోకి ఎక్కిస్తున్న హమాలీల దాహార్తిని తీర్చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డీసీపీ బి. రామ్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్, వివిధ శాఖల అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు.

Scroll to Top