రాజ్యాంగం అనేది భారతీయుల ఆత్మ
** తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాజ్యాంగం కేవలం ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు… ఇది భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు మూలాధారం అని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ఈ రాజ్యాంగ సూత్రాలను మార్గదర్శకంగా తీసుకుని ప్రజలకు నిబద్ధతతో, న్యాయబద్ధంగా, పారదర్శకంగా సేవ చేయాలని సూచించారు.
రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అధ్యక్షత వహించి రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, దీనిని గుర్తుచేసుకుంటూ ఈ దినాన్ని “సంవిధాన్ దివస్”గా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి భారత గణతంత్ర వ్యవస్థకు బలమైన పునాది వేసిందని చెప్పారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు మాత్రమే కాకుండా కర్తవ్య బాధ్యతలను కూడా స్పష్టంగా సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో పోలీసుల పాత్ర కీలకమైందని, బలహీన వర్గాల రక్షణ, చట్టం అమలులో నిష్పాక్షికత, విధులలో సమర్పణ అత్యవసరమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు,(పరిపాలన విభాగం ఇన్ చార్జి), శ్రీనివాసరావు (ఏఆర్), ఏఓ రమేష్, డీఎస్పీ వెంకటనారాయణ(ఎస్.బీ), సాయుధ దళ డీఎస్పీలు, ఆర్ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అందరూ కలిసి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు సంయుక్తంగా ప్రమాణం చేశారు.

