రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – ప్రభుత్వ విప్ విజయరమణరావు….
సాక్షిత పెద్దపల్లి //జిల్లా ప్రతినిధి: సుల్తానాబాద్, రైతులకు అవసరమైన అన్ని విధాలా అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైతు వేదికలో వానాకాలం సాగు సీజన్ సందర్భంగా నిర్వహించిన విత్తన మేళా మరియు “రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి సబ్సిడీపై రైతులకు సన్న వరి విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ సన్న వడ్లకు రూ.500 బోనస్ అందజేస్తున్నట్లు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సన్న వడ్ల బోనస్ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు సుమారు రూ.1,750 కోట్లు కేటాయించగా, పెద్దపల్లి నియోజకవర్గ రైతుల ఖాతాల్లోనే రూ.88.40 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
సుల్తానాబాద్ మండల రైతులకు రూ.16.12 కోట్లు, కాట్నపల్లి రైతులకు రూ.62.91 లక్షలు, నర్సయ్యపల్లి రైతులకు రూ.25.75 లక్షలు, బొంతకుంటపల్లి రైతులకు రూ.33.15 లక్షల బోనస్ అందిందని వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు ఏడు రకాల నాణ్యమైన సన్న వడ్ల రకాలను ఎంపిక చేసి ప్రోత్సహిస్తోందన్నారు. ఈ చర్యలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సాంబ మసూరి (బీపీటీ), తెలంగాణ సోన, హెచ్‌ఎంటీ సోన, జై శ్రీరామ్, కూనారం సన్నలు (1638), వరంగల్-4444 (సిద్ధి), కెఎన్‌ఎం-7715 రకాల సన్న వడ్ల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ రకాల పంటలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బోనస్ అందిస్తుందని స్పష్టం చేశారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గ్రామ సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
